సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహం జాతి ఐక్యతకు చిహ్నం - మోదీ

SMTV Desk 2018-10-31 17:04:54  Sardar vallabhai patel, Narendra modi, Prime minister, Worlds highest statue

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: భారత తొలి ఉప ప్రధాని, హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహాన్నిభారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు అట్టహాసంగా ఆవిష్కరించారు. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన 183 మీటర్ల పొడవుతో ఈ విగ్రహాన్ని నిర్మించారు. ఆవిష్కరణ అనంతరం మోదీ ప్రసంగిస్తూ ఈ విగ్రహం జాతి ఐక్యతకు చిహ్నమన్నారు.‘పటేల్ చొరవ చూపకుంటే గుజరాత్‌లోని గిర్ సింహాలను, సోమనాథ్ ఆలయాన్ని చూడడానికి, హైదరాబాద్‌లోని చార్మినార్‌ను సందర్శించడానికి కూడా భారతీయులు వీసా తీసుకోవాల్సిన దుస్థితి వచ్చేది.

పటేల్ దూరదృష్టి, మేధ కారణంగానే మనదేశంలో ని 562 స్వదేశీ సంస్థానాలు విలీనం అయ్యాయి. సర్దార్ పటేల్ పనిచేయకుంటే సివిల్ సర్వీస్ లో సంస్కరణలూ వచ్చేవి కావు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా సరిగ్గా రైల్వే లైన్‌ను కూడా ఉండేది కాదు. దేశవిభజన తర్వాత అస్తవ్యస్తంగా మారిన పోలీస్, ఇతర కేంద్ర సర్వీసులను పటేల్ ప్రక్షాళన చేశారు. పంచాయితీ ఎన్నికల్లో మహిళలు పోటీ చేసేలా చర్యలు తీసుకున్నారు.. ’ అని మోదీ గుర్తు చేశారు. నర్మద వొడ్డున ఏర్పాటైన తొలి హోం మంత్రి విగ్రహావిష్కణ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ తదితర ప్రముఖులు హాజరయ్యారు.