ఘోర అగ్ని ప్రమాదం

SMTV Desk 2018-10-31 16:49:45  Italy, Exporting, Cars, Fire accidents, Sea, Savona port

ఇటలీ, అక్టోబర్ 31: సవోనా పోర్టులో ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉంచిన కొత్త కార్లను పార్కింగ్ స్థలంలో ఉంచారు. అయితే ఆ పార్కింగ్ స్థలం పోర్టు ఏరియాలో ఉండటంతో సముద్రంలోని అలలు ఎగసిపడి పార్కింగ్‌లోని రెండు కార్లపై పడ్డాయి. ఉప్పునీరు కార్ల బ్యాటరీలకు తాకడంతో రసాయనిక చర్య ఏర్పడి పేలుడు సంభవించి మంటలు వచ్చాయి. మొదట రెండు కార్ల నుంచి మంటలు లేచి కాసేపటికి మిగతా కార్లకు అంటుకున్నాయి. వందలాది కార్లు కాలిపోయాయి.







అక్కడ నిలిపి ఉంచిన లారీలు, ఇతర వాహనాలకు కూడా మంటలు వ్యాపించాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా.. భారీగా ఆస్తి నష్టం జరిగింది.

కొద్ది రోజులుగా ఇటలీలో భారీ వర్షాలు, ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పోయిన వారం కూడా సవోనా పోర్టులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పోర్టు అథారిటీకి చెందిన ఓ భవనంలో అగ్నిప్రమాదం జరిగి భవనం పూర్తిగా దగ్ధమైంది. వారం వ్యవధిలోనే రెండు ఘటనలు చోటు చేసుకోవడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.