సచిన్ రికార్డ్ ని తిరగరాసిన రోహిత్

SMTV Desk 2018-10-29 18:58:12  rohith sharma, odi, new record, sachin tendulkar

ముంబై, అక్టోబర్ 29: భారత్ - విండీస్ తో జరుగుతున్న 5 వన్డేల క్రమంలో నాల్గో వన్డే నేడు ముంబయి వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో మొదట టాస్ గెటిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుని భారీ స్కోర్ చేసింది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్‌ రోహిత్ శర్మ (162: 137 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్సులు) సెంచరీ సాధించడంతో అనేక రికార్డులు బద్దలు కొట్టాడు. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 21వ సెంచరీ కాగా, ఓపెనర్‌గా 19వ సెంచరీ కావడం విశేషం. ఈ క్రమంలో రోహిత్‌ శర్మ సరికొత్త రికార్డును నమోదు చేశాడు. ఓపెనర్‌గా 19వ సెంచరీ పూర్తి చేసుకున్న క్రమంలో అతి తక్కువ ఇన్నింగ్స్‌లు ఆడిన భారత బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ రికార్డు సాధించాడు. మొత్తంగా రెండో స్థానంలో ఉన్నాడు.





107 ఇన్నింగ్స్‌ల్లోనే రోహిత్‌ శర్మ ఓపెనర్‌గా 19వ సెంచరీ నమోదు చేయగా.... అంతకముందు సచిన్‌ టెండూల్కర్‌ 115 ఇన్నింగ్స్‌ల్లో ఓపెనర్‌గా 19 సెంచరీలు పూర్తి చేశాడు. సచిన్‌ కంటే 8 ఇన‍్నింగ్స్‌లు ముందే రోహిత్ శర్మ ఈ ఘనత సాధించాడు.

ఈ జాబితాలో దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్‌ ఆమ్లా అగ్రస్థానంలో ఉన్నాడు. ఆమ్లా 102 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు. ఇక, తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 21 సెంచరీలు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో హషీం ఆమ్లా(116), విరాట్ కోహ్లీ(138), ఏబీ డివిలియర్స్‌(183) తర‍్వాత స్థానంలో రోహిత్‌ నిలిచాడు. రోహిత్‌ శర్మ కేవలం 186 ఇన్నింగ్స్‌ల్లో 21వ సెంచరీని సాధించాడు. అలాగే 2013 నుంచి చూస్తే అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్‌ రెండో స్థానంలో నిలిచాడు. విరాట్‌ కోహ్లి(25) తొలి స్థానంలో ఉండగా, రోహిత్‌ శర్మ(19) రెండో స్థానంలో ఉన్నాడు.

మరోవైపు ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ నాలుగు సిక్సులు బాదడంతో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డుని సమం చేశాడు. వన్డేల్లో భారత్ తరపున అత్యధిక సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా రోహిత్‌ శర్మ... సచిన్ (195 సిక్సులు) రికార్డుని సమం చేశాడు. కిమో పాల్‌ వేసిన 40 ఓవర్‌ ఐదో బంతిని సిక్స్‌ కొట్టడంతో సచిన్‌ సిక‍్సర్లు రికార్డును రోహిత్‌ శర్మ సమం చేశాడు. ఈ జాబితాలో భారత్ తరుపున ధోని(211 సిక్సర్లు) అగ్రస్థానంలో ఉన్నాడు.