సముద్రంలో కుప్పకూలిన విమానం

SMTV Desk 2018-10-29 12:48:54  plane crash

ఇండోనేషియా, అక్టోబర్ 29: ఇండోనేషియాకు చెందిన ‘లయన్ ఎయిర్’ బోయింగ్ ప్యాసింజర్ విమానం సోమవారం ఉదయం జావా సముద్రంలోకూలిపోయింది. ఆ విమానంలో 178 మంది పెద్దలు, వొక చిన్నారి, ఇద్దరు పసిపాపలు, ఇద్దరు పైలట్లు, ఐదుగురు క్యాబిన్ సిబ్బంది కలిపి మొత్తం 188 మంది ఉన్నారు. స్థానిక సమయం ప్రకారం ఈరోజు ఉదయం 6.30 గంటకు లయన్ ఎయిర్ విమానం ఇండోనేషియా రాజధాని జకార్తాలో విమానాశ్రయం నుంచి సుమిత్రా ద్వీపంలోని పాంగ్ కల్ పినాంగ్ అనే ప్రాంతానికి బయలుదేరింది. టేకాఫ్ చేసిన 13 నిమిషాలకే విమానం ట్రాఫిక్ కంట్రోల్ తో సంబందాలు తెగిపోయాయి.

ఆ సమయంలో విమానం జావా సముద్రంపై నుంచి వెళుతోంది కనుక సముద్రంలో కుప్పకూలిపోయినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే సహాయ బృందాలు అక్కడికి చేరుకొని గాలింపు కార్యక్రమం చేపట్టాయి. విమానం సముద్రంలో సుమారు 30-40 మీటర్ల లోతున ఉన్నట్లు ప్రాధమిక సమాచారం. కనుక ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఏ వొక్కరూ బ్రతికి ఉండే అవకాశం లేదనే భావించవచ్చు. విమాన ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియవలసి ఉంది. ప్రమాదానికి గురైన బోయింగ్ 737-మాక్స్-8 విమానాన్ని రెండు నెలల క్రితమే లయన్ ఎయిర్ సంస్థ కొనుగోలు చేసింది.