అసామాన్యమైన సేవలందించిన దోమురు ఇకలేరు ...!!

SMTV Desk 2018-10-03 12:55:56  communist Party ,Chief Do Muoi dies,

హనోరు ,అక్టోబర్ 03: వియత్నాం కమ్యూనిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి, ఫ్రెంచ్‌ వలస సర్కారుకు వ్యతిరేకంగా ఉద్యమించిన నేత దోమురు (101) సోమవారం రాత్రి ఇక్కడి జాతీయ సైనిక ఆస్పత్రిలో కన్నుమూశారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. గత కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న దో మురుకి వియత్నాం వైద్యులతో పాటు విదేశీ వైద్య నిపుణులు కూడా వైద్యం అందించినా ఫలితం కన్పించలేదు. వివిధ హోదాలలో అసామాన్యమైన సేవలందించిన దోమురు పార్టీ కోసం, విప్లవ పథంలో దేశాన్ని ముందుకు నడిపించడం కోసం అనేక త్యాగాలు చేశారని మురు సలహాదారు ఫాన్‌ట్రింగ్‌ కిన్‌ను ఉటంకిస్తూ అధికార మీడియా తన వార్తా కథనాలలో పేర్కొంది. ఆర్నెల్ల క్రితం జ్వరం, శ్వాస సంబంధమైన సమస్యలతో బాధపడిన దోమురు ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారని, వైద్య చికిత్స సమయంలో ఆయనకు ఊపిరితిత్తులు, కిడ్నీ సమస్యలు కూడా తలెత్తాయని మీడియా వివరించింది. 1917లో హనోరులో జన్మించిన దోమురు 1936లో ఫ్రెంచ్‌ ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని తరువాత ఇండోచైనా (వియత్నాం) కమ్యూనిస్టు పార్టీలో చేరారు. 1941లో ఆయన్ను అరెస్ట్‌ చేసిన ఫ్రెంచ్‌ ప్రభుత్వం పదేళ్లపాటు జైలులో పెట్టింది. కానీ ఆయన 1945లో వియత్నాంకు స్వాతంత్య్రం ప్రకటించటానికి కొద్ది ముందు జైలునుండి తప్పించుకున్నారు. స్వాతంత్య్రానంతరం ఆయన పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ వివిధ హోదాలలో సేవలందించారు. 1982లో వియత్నాం కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరోకు ఎన్నికైన ఆయన 1988లో వియత్నాం ప్రధానిగా నియమితులయ్యారు. 1997లో పదవీ విరమణ చేసే వరకూ ఆయన కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. పదవీ విరమణ అనంతరం ఆయన అరుదైన సందర్భాలలో మాత్రమే ప్రజలకు కన్పించారు. దోమురుకి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.